జైపూర్ హైవేపై బస్సు మంటల్లో ఆవిరై ముగ్గురు మృతి చెందారు
కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం విషాదాన్ని మరువకముందే, మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. జైపూర్-ఢిల్లీ హైవేపై బస్సు మంటల్లో ఆవిరై ముగ్గురు మృతి చెందగా, మరో పదిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నుంచి జైపూర్ వైపు కార్మికులను తీసుకెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు 11,000 వోల్ట్‌ల హైటెన్షన్ వైర్లను తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఉదవాలా సమీపంలో చోటుచేసుకుంది. బస్సులో ఉన్న కార్మికులు ఒక్కసారిగా ఆందోళనకు గురై, కొందరు కిందికి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. బాధితులు షాపురా ప్రాంతంలోని ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులుగా గుర్తించారు.
సమాచారం అందుకున్న వెంటనే మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, పరిపాలనా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని షాపురా సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించగా, తీవ్ర గాయాలతో ఉన్న ఐదుగురిని మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు.
అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.