కర్నూలు బస్సు ప్రమాదంపై డ్రైవర్ నిర్లక్ష్యం? పోలీసుల దర్యాప్తు వేగవంతం
కర్నూలు సమీపంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘోర బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. బస్సు డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి కేవలం 10–15 నిమిషాల ముందు అదే మార్గంలో వెళ్ళిన 19 భారీ వాహనాలు రోడ్డుపై పడివున్న బైక్‌ను తప్పించుకుని వెళ్లాయని పోలీసులు గుర్తించారు. అయితే అదే బైక్ బస్సు డ్రైవర్‌కి ఎందుకు కనిపించలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
శుక్రవారం తెల్లవారుజామున చిన్నటేకూరు సమీపంలో ఇద్దరు యువకులు బైక్‌పై ప్రయాణిస్తుండగా డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, బైక్ రోడ్డుమధ్యలో పడిపోయింది. దాదాపు పావుగంట తర్వాత బెంగళూరు వైపు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు అదే బైక్‌పై దూసుకెళ్లడంతో మంటలు చెలరేగి 19 మంది సజీవదహనమయ్యారు.
డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అయితే అతని వాంగ్మూలాల్లో పొంతనలేమి కనిపించడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వర్షం, చీకటి కారణంగా బైక్ కనిపించలేదని డ్రైవర్ చెప్పినా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతని వాదనను తిరస్కరించారు. ఆ సమయంలో ఇతర డ్రైవర్లు బైక్‌ను తప్పించుకుని వెళ్లినట్లు పోలీసులకు వెల్లడించారు.
ఈ సాక్ష్యాలు కేసులో కీలకంగా మారాయి. ప్రస్తుతం పోలీసులు ఆర్టీఏ, ఫోరెన్సిక్, అగ్నిమాపక శాఖ నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు. నివేదికలు అందిన తర్వాతే బాధ్యతలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన నెల్లూరు దంపతులు రమేశ్–అనూష పిల్లల అంత్యక్రియలకు వెళ్లిన బంధువులు తిరుగు ప్రయాణంలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వరుసగా జరిగిన ఈ దుర్ఘటనలు ఆ కుటుంబంపై విషాద ఛాయలు మోపాయి.